చందమామ
చంద్రుడు లేదా చందురుడు, భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. చంద్రుడిని కథల్లోనూ, భావయుక్తంగాను చందమామ అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 384, 403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు), ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమిడ్, టైటన్, క్యాలిస్టో, మరియు ఐఓ అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.